కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాజిక కార్యకర్తలు హర్ష మాందర్, అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా వలస కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారని, దాంతో తినడానికి తిండిలేక వారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.అలాంటి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేసింది.