అగ్రరాజ్యం అమెరికాకు ఉన్న అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత అగ్రరాజ్యం అమెరికా పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఆ దేశ ట్రెజరీ డిపార్ట్ మెంట్ వెల్లడించిన డేటా ప్రకారం.. ఆ దేశ మొత్తం ప్రభుత్వ రుణ బకాయిలు ఇప్పుడు 30 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నుంచి బయట పడటానికి అమెరికా ఎక్కువగా ఖర్చు చేయడంతో ప్రభుత్వ రుణాలు భారీగా పెరిగాయి. 2019 చివరి నుంచి ఇప్పటి వరకు జాతీయ రుణం సుమారు 7 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది.
ఆ దేశ ఆర్థికవేత్తలు ఇది నిజంగా అతి పెద్ద సమస్య అని అంటున్నారు.”ఇది స్వల్పకాలిక సంక్షోభం కాదు, కానీ మేము దీర్ఘకాలంలో పేదవారిగా ఉండబోతున్నామని అర్థం” అని ప్రపంచ ప్రధాన వ్యూహకర్త డేవిడ్ కెల్లీ అన్నారు. వడ్డీ ఖర్చులు మాత్రమే రాబోయే 10 సంవత్సరాలలో $5 ట్రిలియన్లను అధిగమిస్తుందని అంచనా వేశారు. ఇది 2051 నాటికి మొత్తం ఫెడరల్ ఆదాయంలో దాదాపు సగం ఉంటుందని పీటర్ జి. పీటర్సన్ ఫౌండేషన్ సంస్థ తెలిపింది. పెరుగుతున్న రుణ ఖర్చుల వల్ల వాతావరణ మార్పు వంటి ప్రధాన ప్రాధాన్యతలపై అమెరికా చేసే ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నట్లు కెల్లీ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ ప్రభుత్వం ఇప్పుడు జపాన్ & చైనా నేతృత్వంలోని విదేశీ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు దాదాపు 8 ట్రిలియన్ డాలర్లు బకాయి పడింది.