ఏటా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఆ బడ్జెట్‌లోని అంశాలను క్షుణ్నంగా వివరించడం ఆనవాయితీ. కొందరు ఆర్థిక మంత్రులు ఈ ప్రసంగాన్ని సుదీర్ఘంగా, మరోసారి క్లుప్తంగా చేస్తుంటారు. అయితే అత్యంత ఎక్కువ వివరాలు, పదాలతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టినది మన్మోహన్‌సింగ్. పీవీ నర్సింహారావు ప్రధానిగా, మన్మోహన్ ఆర్థికమంత్రిగా ఉన్న 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏకంగా 18,650 పదాలు ఉన్నాయి.
ఈ విషయంలో 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీది రెండో స్థానం. ఆ బడ్జెట్‌లో 18,604 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో, తక్కువ సమయం ప్రసంగంతో కూడిన బడ్జెట్ రికార్డు హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్‌ది. 1977లో ఆయన 800 పదాలతో, కొద్ది నిమిషాల ప్రసంగంతో బడ్జెట్‌ను ముగించారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. సుదీర్ఘ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్‌దే. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి అప్పటికీ బడ్జెట్ ముగియలేదు. ఇంకో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. మిగతా వివరాలను క్లుప్తంగా చెప్పి ముగించారు.
సుదీర్ఘ ప్రసంగం విషయంలో రెండో స్థానం కూడా నిర్మలా సీతారామన్‌దే. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆమెకాకుండా మరొకరిని చూస్తే.. 2018లో బడ్జెట్ పెట్టిన అరుణ్‌జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు.