మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం కుదిపేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం దెబ్బతినడంతో ఆ దేశ ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు రోజు రోజుకి తరిగిపోతున్నాయి. దీంతో చమరు, నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో శ్రీలంక, భారత్ సహాయాన్ని కోరింది. అత్యవసర చమురు కొనుగోళ్లకు కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వాలని శ్రీలంక మనదేశాన్ని ఆశ్రయించింది.
ఈ విషయంపై గత రెండు వారాలుగా జరుగుతున్న చర్చల తర్వాత భారత్ ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై కూడా సంతకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. “భారతీయ సరఫరాదారుల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి శ్రీలంకకు ఈ 500 మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు” ఒక అధికారి తెలిపారు. అలాగే, భారతదేశం నుంచి అత్యవసరమైన ఆహారం, ఔషధ దిగుమతుల కోసం మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ పై చర్చలు జరుగుతున్నాయని ఒక భారతీయ దౌత్యవేత్త తెలిపారు.