కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తోంది. తొలుత కరోనా పుట్టుకొచ్చిన చైనాలో అత్యధిక మరణాలు సంభవించగా.. ఆ తర్వాత ఇటలీలో భారీగా కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను ప్రాణాంతక వైరస్ గడగడలాడిస్తోంది. ఎంతలా అంటే ఒక్కరోజులనే అమెరికాలో రికార్డు స్థాయిలో 1,783 మంది కరోనాతో చనిపోయారు. దాంతో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 16,498కి చేరుకుంది. ఈ విషయాన్ని ఏఎఫ్‌పీ న్యూస్ వెల్లడించింది.
తాజా మరణాలతో స్పెయిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది అమెరికా. కరోనా పాజిటివ్ కేసుల్లో 4,64,865తో మరేఇతర దేశం అందుకోలేనంత పరిస్థితుల్లో ఉంది. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో గురువారం ఒక్కరోజు దాదాపు 700 మేర కరోనా మరణాలు సంభవించగా.. అమెరికాలో ఇంతకు రెట్టింపు కన్నా ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. అత్యధికంగా ఇటలీలో 18,279 కరోనా మరణాలు సంభవించాయి. అమెరికా, స్పెయిన్ 15,447, ఫ్రాన్స్ 12,210, బ్రిటన్ 7,978 మరణాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా, కరోనా బారిన పడి ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 95,506 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్ కేసులు 1,596, 496 నమోదయ్యాయి. ఇందులో 354,006 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు