ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మఒడి పథకాన్ని ప్రస్తావించారు. అమ్మఒడి పథకంలో భాగంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ల్యాప్ టాప్ పై ఆప్షన్ ఇచ్చామని తెలిపారు. ల్యాప్ టాప్ లు కోరుకున్న వారికి వచ్చే ఏడాది జనవరి 9న అందజేయాలని ఆదేశించారు. ల్యాప్ టాప్ తో పాటు గ్యారెంటీ, వారెంటీ కార్డు కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. ల్యాప్ టాప్ ల సర్వీసు కూడా పక్కాగా ఉండాలని నిర్దేశించారు. బిడ్ ఖరారు చేసే సమయంలోనే గ్యారెంటీ, వారెంటీ, సర్వీస్ తదితర అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ల్యాప్ టాప్ చెడిపోతే గ్రామ సచివాలయంలో ఇవ్వాలని అన్నారు. ఆ ల్యాప్ టాప్ ను సచివాలయ సిబ్బంది సర్వీస్ సెంటర్ కు పంపాలని, మరమ్మతుల అనంతరం వారంలో ల్యాప్ టాప్ తిరిగి తెప్పించాలని సూచించారు. ప్రతి రెవెన్యూ డివిజన్ లో ల్యాప్ టాప్ సర్వీస్ సెంటర్ ఉండాలని తెలిపారు. ఇక గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ పైనా సీఎం జగన్ ఈ సమీక్షలో చర్చించారు. 2023 మార్చి నాటికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని స్పష్టం చేశారు. ఏ స్పీడ్ తో కనెక్షన్ కావాలన్నా ఇచ్చే విధంగా ఉండాలని వివరించారు. అన్ని సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలు ప్రతి గ్రామంలో ఉండాలని తెలిపారు. ఉద్యోగులు సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని, నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 108 గ్రామాల్లో భూగర్భ కేబుళ్లు వేయాలని తెలిపారు.