ఉక్రెయిన్ పై మరింత పెద్ద ఎత్తున దాడికి రష్యా సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఉత్తర దిక్కు నుంచి రష్యా సైన్య వాహన శ్రేణి పెద్ద ఎత్తున ముందుకు కదులుతోంది. 64 కిలోమీటర్ల మేర వున్న రష్యా సైనికుల కాన్వాయ్ ముందుకు సాగుతున్నట్లు అమెరికా టెక్నాలజీ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్ తీసిన శాటిలైట్ చిత్రాలు తెలియజేస్తున్నాయి. గతంలో తీసిన చిత్రాలను పరిశీలిస్తే అప్పుడు 27 కిలోమీటర్ల మేరే రష్యా సైన్యం కనిపించగా, తాజాగా అది రెట్టింపు కావడం వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది.
ఆయుధాలతో కూడిన వాహనాలు, యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, కావాల్సిన సామగ్రితో కూడిన వాహనాలు రష్యా సైనిక కాన్వాయ్ లో కదులుతున్నాయి. దక్షిణ బెలారస్ లో క్షేత్రస్థాయిలో సైనికుల మోహరింపు, హెలికాప్టర్ యూనిట్లు కూడా శాటిలైట్ ఫొటోల్లో కనిపించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలోని ఆంటనోవ్ ఎయిర్ పోర్ట్ దిశగా రష్యా సైనిక కాన్వాయ్ ప్రయాణం చేస్తోంది.
మరోపక్క, రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ లో సోమవారం జరిగిన మొదటి విడత చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వకుండా ముగియడం తెలిసిందే. మరో విడత చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి. తదుపరి చర్చల్లో ఎంతో కొంత పురోగతి ఉంటే యుద్ధం సమసిపోయే అవకాశాలు బలపడతాయి.