జగన్ సర్కారుకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల స్థానిక ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ప్రజల ఆరోగ్యంతో పాటు ఎన్నికల నిర్వహణ అంశమూ ముఖ్యమేనని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది.రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ ఎన్నికల విషయంలో సమన్వయంతో పని చేయాలని ఆదేశించింది. కాగా, విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల కమిషన్ న్యాయవాదులు ఇటీవల వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణను రెండు రోజుల క్రితమే ముగించి, తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకే ఈ రోజు తీర్పు వెలువరించింది. దీంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది.కాగా, ఈ నెల 8న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఏపీ సర్కారు అంగీకరించకుండా ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఈ నెల 11న ఎస్ఈసీ ఆదేశాలను సింగిల్ జడ్జి కొట్టేయడం, దీనిపై ఎన్నికల కమిషనర్ అప్పీల్‌కు వెళ్లడం వంటి పరిణామాలు కొనసాగాయి. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలూ లేకపోలేదు.