contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆడ శిశువును హతమార్చిన తల్లితండ్రులకు జీవిత ఖైదీ !

  • విష ప్రయోగంతో 45 రోజుల వయసు చిన్నారిని చంపిన కసాయి తల్లితండ్రులు
  • ఆడ పిల్లను సాకలేమనే నెపంతో చిన్నారిని 2017లో చిన్నారిని హాతమార్చిన తల్లి, తండ్రి
  • ఆడపిల్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది 

నల్లగొండ : ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి పుట్టిందని, అదృష్టం కలిసి వస్తుందని అంటారు….. కానీ అదే ఆడపిల్ల పుడితే తాము సాకలేమని, ఆడపిల్ల తమకు వద్దని అత్యంత కర్కశంగా కన్న కూతురిని విష ప్రయోగం చేసి చంపేసిన కసాయి తల్లిదండ్రులకు యావజ్జివ కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ న్యాయమూర్థి ఇచ్చిన తీర్పు జిల్లాలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయింది.

వివరాలలోకి వెళితే నల్లగొండ జిల్లా పి.ఏ.పల్లి మండలం పడమటి తండాకు చెందిన గిరిజన దంపతులు రమావత్ జయరామ్, రమావత్ నాగమణి లకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి ఎం.వి.రమేష్ తీర్పునిచ్చారు. ఈ గిరిజన దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టగా, రెండవ సంతానంగా మళ్లీ ఆడ శిశువు జన్మించి అనారోగ్యంతో మృతి చెందింది. మూడవ కాన్పులో మగ బిడ్డ కావాలని ఎదురుచూసిన వారికి మూడవ కాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో తాము సాకలేమని ఆ చిన్నారి ఆరోగ్యం పట్ల పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న క్రమంలో అప్పటి ఐసిడిఎస్ అధికారులు, స్థానిక సిడిపిఓ కలిసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటుగా వారు ఆ చిన్నారిని సాకలేకపోతే శిశుగృహంలో తమ వద్ద చిన్నారిని పెంచుతామని అధికారులు వివరించారు. కానీ ఆ కసాయి తల్లిదండ్రులు తమ బిడ్డను తామే చూసుకుంటామని అధికారులను నమ్మించి చిన్నారిని తీసుకెళ్లారు. ఆ తర్వాత 4 ఫిబ్రవరి 2017 రోజున ఆ చిన్నారి ఆరోగ్యం బాలేదని స్థానిక ఆర్.ఎం.పి. వద్ద వైద్యం చేపించినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని అక్కడ చిన్నారి మృతి చెందిందని మరోమారు అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు.
ఇక్కడే అప్పటి స్థానిక సిడిపిఓ అధికారిణి భూక్యా సక్కుబాయి ఆడ శిశువు మృతి పట్ల తనకు అనుమానం ఉన్నదని, సమగ్ర విచారణ చేయాలని గుడిపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఎస్.ఐ. రాఘవేందర్ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయగా అప్పటి కొండ మల్లేపల్లి సిఐ శివరాం రెడ్డి కేసు సమగ్రంగా దర్యాప్తు చేశారు. విష ప్రయోగం వల్లనే చిన్నారి మృతి చెందినట్లుగా దృవీకరించి అందుకు సంబంధించిన ఆధారాలతో పాటు సాక్ష్యాలను సేకరించి నిందితులను రిమాండ్ చేశారు.
కేసు విచారణలో సాక్ష్యాలు, సమర్పించిన ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి గురువారం చిన్నారిని విష ప్రయోగం చేసి హత్య చేసినట్లుగా దృవీకరించి తల్లితండ్రులకు యావజ్జివ కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి 5,000/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
కేసులో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. జవహర్ లాల్ వాదనలు వినిపించగా అప్పటి కొండమల్లేపల్లి సిఐ శివరాం రెడ్డి సకాలంలో సాక్ష్యాలను సేకరించగా ప్రస్తుత సిఐ పందిరి పరుశురాం, గుడిపల్లి ఎస్.ఐ. గోపాల్ రావు, కోర్టు లైజన్ అధికారి వి. శ్రీనివాస్, కోర్టు కానిస్టేబుల్ రవీందర్ రాథోడ్ సమర్ధవంతంగా పనిచేయగా వీరిని డిఐజి ఏ.వి. రంగనాధ్, దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి అభినందించారు.
ఆడ శిశువుల విక్రయాలు, వివక్షల పట్ల *అమ్మా నన్ను అమ్మకే* పేరుతో పోలీస్ శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు సైతం కల్పించారు. భ్రుణ హత్యలు, ఆడ శిశువుల విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డిఐజి రంగనాధ్ హెచ్చరించారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :