ఇజ్రాయెల్ – గాజా మధ్య పరస్పరం దాడులు చోటుచేసుకున్నాయి. రాకెట్లతో విరుచుకుపడ్డాయి. దీంతో హమాస్ ఉగ్రవాదుల అధీనంలోని గాజాలో 35 మంది పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్ లో ముగ్గురు మరణించారు. మంగళవారం రాత్రి గాజా దాడులకు తెగబడగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గాజా చేసిన రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ లో ఉంటున్న కేరళ మహిళ ఒకరు చనిపోయారు.ముందుగా గాజాలోని హమాస్ తీవ్రవాదులు, ఇతర ఇస్లాం గ్రూపులు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, బీర్షెబా నగరాలపై రాకెట్లతో దాడులు చేశాయని, ఫలితంగానే తాము గాజాపై ప్రతిదాడికి దిగాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ అధికార వర్గాలు చెబుతున్నాయి.హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశామని, తీవ్రవాద గ్రూపులోని నిఘా విభాగం నేతలు కొందరు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించింది. దాంతో పాటు రాకెట్లను ప్రయోగించే ప్రాంతాలు, హమాస్ కార్యాలయాలపైనా దాడులు చేశామని చెప్పింది. దాదాపు 210 దాకా రాకెట్లను టెల్ అవీవ్, బీర్షెబాపై ప్రయోగించినట్టు హమాస్ ఆయుధ విభాగం ప్రకటించింది.