ఇజ్రాయెల్ బలగాలు, హమాస్ ఉగ్రవాద ముఠా మధ్య జరుగుతున్న సాయుధ పోరు యుద్ధాన్ని తలపిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడుతుండడంతో గాజా చిగురుటాకులా వణుకుతోంది. ఫలితంగా వేలాదిమంది పాలస్తీనియన్లు నగరం విడిచి వలస బాట పడుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి రాకెట్‌లు ప్రయోగిస్తూనే ఉన్నారు. నిన్నటి వరకు ఏకంగా 1800 రాకెట్లను ప్రయోగించారు.ఇంకోవైపు, ఇజ్రాయెల్ కూడా దీటుగా బదులిస్తోంది. గాజాపై 600కుపైగా వైమానిక దాడులు చేపట్టింది. తాజా దాడులతో గాజాలో మృతి చెందిన వారి సంఖ్య 119కి పెరిగింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో చెలరేగిన ఘర్షణల్లో 10 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బలగాలు కాల్చి చంపాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానం దాడిలో గాజాలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. కాగా, హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడిలో మృతి చెందిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ (30) భౌతిక కాయం నేడు ఢిల్లీకి రానుంది.