నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్ మెంట్ ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే లోపే మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల్లోని సిబ్బంది ఇప్పటివరకు నమోదవ్వని ఆస్తుల వివరాలను నూటికి నూరు శాతం ఆన్ లైన్ చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణ 100 శాతం పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామని ఈ లక్ష్య సాధన కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, రైతుబంధు రాష్ట్రసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.