హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తప్పుబట్టారు. తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా ప్రజా నాయకుడు కేసీఆర్‌ను ఈటల ఛాలెంజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను ఈటల విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ఆ పథకాలను విమర్శించడు. కానీ రాజేందర్ లాంటి బీసీ నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. రైతుబంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంత గొప్ప పథకాన్ని రాజేందర్ విమర్శించడం బాధేసిందన్నారు.
ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా కేసీఆర్ నియమించారు. ఉద్యమంలోనూ సముచితమైన స్థానం కల్పించారు. రాజకీయ నాయకులు అసైన్డ్ భూముల జోలికి పోవద్దు. అసైన్డ్ భూమి ఎవరూ అమ్ముకోవద్దు. అమ్మడానికి వీల్లేదు అని ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. మరి ఆ నిబంధనను ఉల్లంఘించడం నేరం. దానిపై విచారణ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గానికి ఏది కావాలంటే అది సీఎం మంజూరు చేశారు అని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కంటే ముందు ఒక సంవత్సర కాలం పాటు కేసీఆర్ వివిధ రాజకీయ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు, మేధావులతో తెలంగాణ సమస్యలు, నాడు జరుగుతున్న అలజడులు, అశాంతి, రైతుల ఆత్మహత్యలు, యువకులను నక్సలైట్ల పేరిట చంపడం.. ఇలాంటి అనేక అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టమైతేనే ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చర్చలు జరుగుతున్న రోజులవి. ఈ ప్రజలకు తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడటమే భవిష్యత్ అని నిర్ణయించారు. కరెంట్, నీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించబడింది.
పార్టీ ఏర్పాటైనే వెంటనే పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టారు. నాటి సీఎం చంద్రబాబు చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తది.. టీఆర్ఎస్ ఓడిపోతదని బాబు ఊహించారు. 2001లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగినప్పుడు రైతు నాగలి గుర్తుపై పోటీ చేయడం జరిగింది. నాటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కరీంనగర్ జిల్లా పరిషత్‌ను కూడా కైవసం చేసుకున్నాం. అలా విజయం సాధించి చంద్రబాబుకు గట్టి తీర్పునిచ్చాం. 2003లో ఈటల టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఎంతో మందిని వదులుకుని ఈటలకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఇప్పటికైనా కమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.