భద్రతామండలిలో ఉక్రెయిన్‌పై ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్‌కు రష్యా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఓటింగ్‌ను తమతో పాటు వ్యతిరేకించిన చైనాకు కూడా రష్యా ప్రతినిధి డిమిట్రి పొల్యాన్‌స్కీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ దేశాలు అమెరికా మెలికలను తట్టుకొని ధైర్యంగా నిలుచున్నాయన్నారు. అమెరికా దౌత్యవిధానాలు అల్పస్థాయికి దిగజారాయని దుయ్యబట్టారు. ఉక్రెయిన్ విషయంలో నిర్మాణాత్మక చర్చలు అవసరమని భారత్ అభిప్రాయపడింది.
అక్కడ ఉద్రిక్తతలను పెంచే చర్యలను అనుమతించకూడదని కోరింది. ఉక్రెయిన్‌లో దాదాపు 20వేల మంది భారతీయులు నివసిస్తున్నారని, వారి సంరక్షణే తమ ప్రాధాన్యాంశమని ఐరాసలో భారత రాయబారి త్రిమూర్తి చెప్పారు. మరోవైపు తమ ప్రతిపాదనలకు రష్యా నుంచి సమాధానం వచ్చిందని అమెరికా మంగళవారం ప్రకటించింది. అయితే తామెలాంటి స్పందనను పంపలేదని రష్యా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ విషయంలో జరిగిన అన్ని చర్చలు విఫలమయ్యాయి.