తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో 30 శాతం పెంపుతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. జూన్ నెల నుంచే పెంపును వర్తింపజేయాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది. అంటే జులై నుంచి పెరిగిన వేతనం అందుతుంది. నిజానికి మార్చి 22నే పీఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది.
కాగా, నోషనల్ బెనిఫిట్‌ను 1 జులై 2018 నుంచి, ఆర్థిక లబ్ధిని 1 ఏప్రిల్ 2020 నుంచి అమలు చేస్తారు. వేతనాల్లో మార్పును 1 ఏప్రిల్ 2021 నుంచి అమలు చేయనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఇక, పింఛన్ దారులకు 1 ఏప్రిల్ 2020 నుంచి చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ది చేకూరనుంది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. పీఆర్సీ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నాయి.