ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించనున్నట్టు సమాచారం. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. కాసేపట్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ బదిలీకి సంబంధించి ఇంతవరకు అధికారులెవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం.