హైదరాబాదులోని కాప్రా మున్సిపాలిటీలో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో డీఈ మహాలక్ష్మి అడ్డంగా బుక్కయ్యారు. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దీంతో, ఆమె నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ మల్లాపూర్ లో స్వీపర్ గా పని చేస్తున్న రాములు చనిపోవడంతో ఆయన భార్య సాలెమ్మకు ఉద్యోగం వచ్చిందని… ఉద్యోగం ఇప్పించినందుకు సాలెమ్మను మహాలక్ష్మి రూ. 20 వేలు డిమాండ్ చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో సాలెమ్మ కుమారుడు శ్రీనివాస్ తమకు ఫిర్యాదు చేశాడని… ఈరోజు రూ. 20 వేలు ఇస్తుండగా మహాలక్ష్మిని పట్టుకున్నామని తెలిపారు.
మహాలక్ష్మి అసిస్టెంట్ విజయ మల్లాపూర్ లోని యాదగిరి ఫంక్షన్ హాల్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చెప్పారు. అనంతరం మహాలక్ష్మి కార్యాలయంతో పాటు చక్రపురి, నాగారంలో ఉన్న ఆమె నివాసాల్లో సోదాలు చేస్తున్నామని… ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన లెక్కల్లో లేని బంగారం, నగదును గుర్తించామని తెలిపారు. సోదాలు పూర్తయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెడతామని చెప్పారు.