అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ హోం మంత్రి తన బాధ్యతలను ఓ మహిళా కానిస్టేబుల్‌కు అప్పగించారు. ఒక్క రోజు హోం మంత్రిగా కానిస్టేబుల్ మీనాక్షీ వర్మ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నా బాధ్యతలను మీనాక్షీ వర్మకు అప్పగించాను’ అని తెలిపారు. ఒక్క రోజు హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షీ వర్మ.. సాధారణ ప్రజల సమస్యలను తెలుసుకోనుంది. ఇక, కానిస్టేబుల్ మీనాక్షీ వర్మ హోం మినిస్టర్ నివాస కార్యాలయంలో భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తుంటారు.ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఒక్క భారతదేశం మాత్రమే స్త్రీని అమ్మ మాదిరిగా గౌరవిస్తుందని మంత్రి అన్నారు. అంతేకాదు, మహిళకు అమ్మస్థానం కట్టబెట్టిన దేశం కూడా మనదేనని తెలిపారు. ‘మరే దేశంలోనైనా చూడండి, అక్కడ మహిళలను అలాంటి గౌరవం లేదా హోదాతో గుర్తిస్తారా? అది పాకిస్థాన్ అయినా, మరే దేశమైనా.. భారతదేశంలో మహిళలకు గౌరవం మన సంస్కృతిలో భాగం.. ఇదే మనకు ప్రత్యేక గుర్తింపు’ అని మంత్రి అన్నారు.ఇటీవల ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ బాలిక ఒక్క రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్ వేసవి రాజధాని గైర్‌సైన్ నుంచి సృష్టి గోస్వామి అనే యువతి సీఎంగా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాల పనితీరును తెలుసున్నారు. హరిద్వార్ జిల్లా దౌలతాపూర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి రూర్కీలోని బిఎస్‌ఎమ్ పీజీ కాలేజ్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది.