గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరం ఆహర భద్రతను కోల్పోయిన వారి సంఖ్య రెట్టింపు అయిందని ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని డబ్ల్యూఈపీ (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్) వ్యాఖ్యానించింది. గత సంవత్సరం ఆకలి బాధను 13.5 కోట్ల మంది అనుభవించగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 26.50 కోట్లకు చేరిందని పేర్కొంది. ముఖ్యంగా టూరిజంపై ఆధారపడిన ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలపై ఈ ప్రభావం అధికంగా ఉందని, ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రయాణికులపై ఆధారపడి, వారికి పలు రకాల ఆహార ఉత్పత్తులను అమ్ముకుంటూ బతుకు వెళ్లదీస్తున్న వారూ ఆకలితో మగ్గిపోతున్నారని వెల్లడించింది. లాక్ డౌన్ మొదలైన నెల రోజుల వ్యవధిలోనే ఆకలితో అలమటిస్తున్న వారి జాబితాలో 13.5 కోట్ల మంది చేరిపోయారని డబ్ల్యూఈపీ రీసెర్చ్ విభాగం డైరెక్టర్ ఆరిఫ్ హుస్సేన్ హెచ్చరించారు.