కరోనా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి పోలీసులు ముందు వరుసలో నిలిచి సేవలు అందిస్తున్నారు. రేయింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వేళకు తిండి లేకుండా, ఎక్కడ ఏది దొరికితే అది తింటూ, ఇంటిని వదిలి విధులకే అంకితమయ్యారు. అయితే మధ్యప్రదేశ్ లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. భోపాల్ లో విధులు నిర్వర్తిస్తున్న చేతన్ సింగ్ అనే 36 ఏళ్ల కానిస్టేబుల్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకున్నాడు. దాంతో సహచరులు వెంటనే అతడ్ని భోపాల్ లోని ఓ ఆసుపత్రికి తరలించగా, ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు.చేతన్ సింగ్ తనకు కరోనా విధులు కేటాయించడంతో పైఅధికారుల పట్ల అసంతృప్తితో ఉన్నట్టు సన్నిహిత వర్గాలంటున్నాయి. విధి నిర్వహణలో తనకు కూడా కరోనా సోకుతుందేమోనని అతడు భయపడేవాడని, ఉన్నతాధికారులు కూడా అతడి భయాలను పట్టించుకోవడం లేదన్న మనోవేదనతో తుపాకీతో కాల్చుకున్నాడని సహచరులు చెబుతున్నారు. మొదట గాల్లోకి కాల్పులు జరిపిన చేతన్ ఆపై ఎడమ చేతికి గురిపెట్టి కాల్చుకున్నాడు.భోపాల్ లో 10 మంది వరకు పోలీస్ సిబ్బంది కరోనా బారినపడడంతో ఇతర పోలీసుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. దాంతో వారిలో ఆత్మస్థైర్యం కలిగించేందుకు పోలీసు విభాగం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఓ సైకియాట్రిస్టును నియమించింది.