తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 637 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కరోనాను కట్టడి చేసే యత్నంలో భాగంగా ప్రాణాలను పణంగా పెట్టిన పలువురు వైద్య, పోలీసు సిబ్బంది కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా డీఎస్పీ శశిధర్ కరోనాతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈయన మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నారు. ఆయనకు ఇదివరకే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శశిధర్ మృతిపై జిల్లా పోలీసు అధికారులు సంతాపం ప్రకటించారు.