కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆ పరిహారం ఎంత? అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆరు వారాల్లోగా పరిహారంపై మార్గదర్శకాలను రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ అధీకృతసంస్థ (ఎన్డీఎంఏ)కు ఆదేశాలిచ్చింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఇవ్వాళ జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం విచారించింది.
విధి నిర్వహణలో ఎన్డీఎంఏ విఫలమైందని, కనీస ప్రమాణాలనూ పాటించలేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విపత్తు నిర్వహణ చట్టాన్ని తాము పరిశీలించామని, దానిప్రకారం ‘కచ్చితం’ అనేది తప్పనిసరి అని ఉందని పేర్కొంది. కానీ, అలాంటి మార్గదర్శకాలను ఎన్డీఎంఏ పాటించినట్టు ఎలాంటి రికార్డూ లేదని పేర్కొంది. పరిహారం, ఉపశమనం/సాయం వంటి వాటిని నిర్ణయించడంలో సంస్థ కనీస ప్రమాణాలను పాటించాలని సూచించింది.
అయితే, కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి తాము సూచన చేయవచ్చా? అన్నదే ఇక్కడ ప్రశ్న అని, దీనిపై న్యాయ సమీక్ష విషయం కూడా చర్చించామని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రాధాన్యాలు, సాయం వంటి వాటిని ప్రభుత్వమే నిర్ణయించాలి. బాధితులకు ఆహారం, వసతిని ప్రభుత్వమే కల్పించాలి. ప్రభుత్వమే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి”అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే, ఏ దేశానికీ అపరిమిత ఆర్థిక వనరులుండవని, పరిహారం చెల్లింపునకు ఆర్థిక పరిమితులున్నాయని చెప్పింది. చనిపోయిన వారి ప్రతి కుటుంబానికీ రూ.4 లక్షలు ఇవ్వాల్సిందేనని తాము చెప్పడం సరైంది కాదని పేర్కొంది. పరిహారం ఎంతివ్వాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చునని తెలిపింది. అయితే, కొన్ని రోజుల క్రితం జరిగిన విచారణ సందర్భంగా.. తాము పరిహారం చెల్లించలేమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగైతే విపత్తు నిధులన్నీ వాడినా అందుకు సరిపోవని, పైగా రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని వివరించింది.