హైదరాబాదులోని కొన్ని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా టెస్టింగ్, చికిత్సకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే, పేషెంట్ల నుంచి భారీ దోపిడికి ప్రైవేట్ ఆసుపత్రులు పాల్పడుతున్నాయని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు… నగరంలోని కేర్, యశోద, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు నోటీసులను జారీ చేసింది. ఎంత చార్జీలను వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ… ఆసుపత్రులు పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయంపై 14వ తేదీ లోపల వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.