ఇటీవల చైనా బలగాలతో సరిహద్దు ఘర్షణల్లో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. అంతేకాదు, సంతోష్ బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఇక, సంతోష్ బాబుతో పాటు ఆ ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి నగదు సాయం అందజేస్తానని తెలిపారు.