కేరళలో గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి జిల్లా రాజమలలోని పెట్టిముడిలో కొండచరియలు విరిగి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల నివాసాలపై పడడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. అలాగే, శిథిలాల కింద మరో 50 మంది వరకు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిని రక్షించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా చికిత్స అందించనున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.