తీవ్ర ఉత్కంఠ నడుమ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. చివరి రౌండ్ వరకు టీఆర్ఎస్ తో నువ్వానేనా అన్నట్టు సాగిన ఓట్ల లెక్కింపు పర్వంలో రఘునందన్ రావు 1,470 ఓట్ల అధిక్యంతో విజేతగా అవతరించారు. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా దుబ్బాక ప్రజలు తమవైపే నిలిచారని వ్యాఖ్యానించారు.సీఎం కేసీఆర్ అహంకారానికి, నిరంకుశత్వానికి, స్వార్థపూరిత రాజకీయాలకు, రజాకార్లను తలపించే వ్యవహారశైలికి ఇవాళ దుబ్బాక ప్రజలు సమాధి కట్టారని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఎంతో కష్టపడిన ఫలితమే దుబ్బాకలో తమ విజయం అని కొనియాడారు. ఈ గెలుపును కార్యకర్తలకే అంకితం ఇస్తున్నామని తెలిపారు. అనేకమంది నేతలు దుబ్బాకలో శ్రమించారని, రఘునందన్ రావు ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతాడని అన్నారు.ఇటీవలే పార్టీ ఆఫీసు ముందు ప్రాణత్యాగం చేసిన శ్రీనివాస్ స్ఫూర్తి కూడా ఈ విజయంలో ఇమిడి ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. 2023లోనూ ఇదే విధంగా గెలుస్తామని, ఈ పరంపరను ఇకముందు కూడా కొనసాగిస్తామని ఉద్ఘాటించారు.