ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానిపై చర్యలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆదేశించారు. కొడాలి నాని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని… ఆయనపై ఐపీసీ 504, 505(1)(సి), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోడ్ ను ఉల్లంఘించినందుకు క్లాజ్-1, క్లాజ్-4 కింద కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.నిమ్మగడ్డ రమేశ్ పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడతూ నిమ్మగడ్డను, చంద్రబాబును విమర్శించారు. దీంతో, కొడాలి నానికి ఎస్ఈస్ షోకాజ్ నోటీసులు పంపించింది. ఈ నోటీసులకు తన వివరణను లాయర్ ద్వారా నాని పంపించారు. రాజ్యాంగ వ్యవస్థలపై తనకు గౌరవం ఉందని, ఎస్ఈసీని కించపరిచే ఉద్దేశం తనకు లేదని వివరణలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ అరాచకాలను బయటపెట్టే క్రమంలోనే తాను మీడియా సమావేశాన్ని నిర్వహించానని చెప్పారు. షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, నాని వివరణతో సంతృప్తి చెందని ఎస్ఈసీ… ఆయనపై చర్యలకు ఆదేశించారు. కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.