ఓ టికెట్ కలెక్టర్ గతేడాది రికార్డు స్థాయిలో రూ.1.51కోట్ల రికార్డు జరిమానాల్ని వసూలు చేశాడని భారతీయ రైల్వే శాఖ అధికారి తెలిపారు. సెంట్రల్ రైల్వేలో పనిచేసే టికెట్ కలెక్టర్ టీసీ ఎస్.బి. గలాండే టికెట్ లేకుండా ప్రయాణించిన 22,680 రైల్వే ప్రయాణికుల వద్ద నుంచి కోటిన్నర వరకు జరిమానా వసూలు చేసి ఆ శాఖకు ఆదాయాన్ని అందించాడు. దీంతో 2019 ఏడాదిలో అత్యధిక జరిమానాలు వసూలు చేసిన టీసీగా గలాండే నిలిచాడు.గలాండే సహా మరో ముగ్గురు టీసీలు కోటి రూపాయలకు పైగా టికెట్ జరిమానాలు వసూలు చేశారు. ఎంఎం షిండే (సెంట్రల్ రైల్వే) 16,035 మంది టికెట్ తీసుకోని ప్రయాణికుల వద్ద నుంచి గతేడాది రూ.1.07కోట్ల జరిమానాలు కలెక్ట్ చేశాడు. ముంబై డివిజన్‌కు చెందిన చీఫ్ టికెట్ కలెక్టర్ జి.రవికుమార్ రూ.1.45కోట్ల జరిమానాలు వసూలు చేసి రెండో స్థానంలో ఉన్నారు. టికెట్ లేకుండా ప్రయాణించిన 20,657 మందికి రవికుమార్ జరిమానాలు విధించారు. మరో టీసీ డి.కుమార్ టికెట్ లేని 15,234 మంది ప్రయాణికులకు జరిమానా విధించి రూ.1.02కోట్ల నగదు ఆ శాఖ ఆదాయాన్ని సమకూర్చారు.