కోటికి పైగా లంచం తీసుకుంటూ దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో బయటపడుతున్న అక్రమాస్తులు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 28 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ కోసం రియల్ ఎస్టేట్ వ్యక్తుల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసి రూ.1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం తెలిసిందే. కాగా, ఈ కేసులో తవ్వేకొద్దీ అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తహసీల్దార్ నాగరాజు ఆస్తుల విలువ రూ.100 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. హైదరాబాదు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. నాగరాజును పట్టుకున్న సమయంలో లంచం సొమ్ము రూ.1.10 కోట్లతో పాటు ఇంట్లో సోదాలు చేసి మరో రూ.28 లక్షలు, 2 కిలోల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను కూడా సీజ్ చేశారు.