కోడి కత్తి గుచ్చుకుని ఒక వ్యక్తి చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం నిప్పువనం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే స్థానికంగా ఉన్న కలిచెర్ల పోలేరమ్మ గుడి సమీపంలో కోడి పందేలు జరుగుతున్నాయనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో, వారు దాడి చేసేందుకు వెళ్లారు. పోలీసులను చూసిన పందెంరాయుళ్లు పరుగులు తీశారు. అయితే వెళ్తూవెళ్తూ కోడిని కూడా తీసుకుని వెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారు. ఈ హడావుడిలో కోడికి కట్టి ఉన్న కత్తి ఆయనకు గుచ్చుకుంది. కోతి కత్తి ఎంతో పదునుగా ఉండటంతో, అది ఆయనకు లోతుగా దిగింది. దీంతో కత్తి పొడుచుకున్న వెంటనే విపరీతంగా రక్తస్రావం కావడం ప్రారంభమయింది. ఆ వెంటనే ఆయనను హుటాహుటిగా ముదివేడుకు తరలించి, అక్కడి పీహెచ్సీలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మరోవైపు కోడి పందేలు ఆడిన 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.