కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ ఇది. గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) నేడు పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని కూడా సమాచారం. అయితే, తాను ఏ పార్టీలోనూ చేరబోనని, స్వతంత్రంగానే ఉంటానని చెప్పారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనను అవమానించారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలోని కొందరు కుట్రలు చేశారని, ఇవన్నీ తట్టుకోవడం ఇక తన వల్ల కాకపోవడం వల్లే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు ఓ పత్రికతో మాట్లాడుతూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రాజీనామా లేఖను నేడు అధిష్ఠానానికి సమర్పిస్తానని చెప్పారు. పార్టీని వీడడానికి గల కారణాలను వివరిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని కూడా జగ్గారెడ్డి భావిస్తున్నారు.