అనంతపురం : పెనుకొండ మండలం ఎర్రమంచి సమీపంలో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరువైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు కియా కంపెనీ ప్రధాన గేట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో కారులో ఉన్న వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మృతులను బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, ఢిల్లీకి చెందిన మరో యువకుడిగా గుర్తించారు. యువతులను గుర్తించాల్సి ఉంది.కారు డ్రైవర్ బీరు తాగుతూ డ్రైవ్ చేస్తుండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.