భారతదేశం పేరును ‘మోదీ’గా మార్చే రోజు ఎంతో దూరంలో లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న కోల్‌కతాలో ‘దీదీర్ సాథ్ అమ్రా (దీదీతో మేమున్నాం) ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మాట్లాడుతూ గుజరాత్‌లోని మోతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టినట్టే దేశానికి కూడా మోదీ పేరు పెడతారని, ఆ రోజు ఎంతో దూరం లేదని మండిపడ్డారు. మోదీ చెబుతున్న ప్రతి ఒక్కటీ అబద్ధమేనన్న మమత.. బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదని మోదీ ఉపన్యాసాలు దంచికొడుతున్నారని, మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని సూచించారు.‘‘మోదీ తన పేరును అంతటా వ్యాపింపజేస్తున్నారు. అన్నింటికీ ఆయన పేరే పెట్టుకుంటున్నారు. కొవిడ్ వ్యాక్సిన్లపైనా ఆయన ఫొటోలు ముద్రించారు. ఇప్పుడది కొవిడ్ వ్యాక్సిన్ కాదు, మోదీ వ్యాక్సిన్. చాలా కాలేజీలు ఇప్పటికే మోదీ పేరుతో నడుస్తున్నాయి. ఇప్పుడు స్టేడియానికి కూడా తన పేరు పెట్టేసుకున్నారు. చూస్తూ ఉండండి ఈ దేశం పేరును కూడా మార్చేసి తన పేరు పెట్టుకుంటారు’’ అని మమత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.