వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వేగంగా పరివర్తనం చెందుతూ ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉందని వెల్లడించారు. చైనాలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ దెబ్బకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. వైరస్‌బారిన పడిన బాధితుల సంఖ్య 440కి చేరినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ఉపమంత్రి లిన్ బిన్ వెల్లడించారు.చైనా నూతన సంవత్సర సెలవుల నేపథ్యంలో లక్షలాది మంది ఒకప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తున్నారని.. వైరస్ వ్యాప్తిని నిరోధించేందకు అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. అవసరమైతే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో థర్మల్ చెకింగ్ జరుపుతామన్నారు. తొలుత ఉహాన్ నగరంలో వెలుగు చూసిన ‘కరోనా’ వైరస్ ఇప్పటి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉహాన్‌లో బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిలో కనీసం 15 మందికి ఆ వైరస్ సోకినట్లు ప్రకటించారు. దీంతో ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి శ్వాస ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ముందుగా ప్రచారం జరిగినట్లు జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పరిస్థితులు విషమిస్తుండటంతో అంతర్జాతీయ ప్రజారోగ్య ఆత్యయిక స్థితిని ప్రకటించే అవకాశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశీలిస్తోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference