ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు కాల్వ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో ఇటీవల వివాదం నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, జగన్ కు మధ్య దోస్తీ ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ఇంతవరకూ కలసిమెలసి అన్యోన్యంగా ఉన్నామని, ఇకపై కూడా అలాగే ఉంటామని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఏ మాత్రమూ వెనక్కి తగ్గబోనని హెచ్చరించారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై తాను ఎప్పుడూ మంచి మాటే చెబుతానని, వినకున్నా తనకు వచ్చిన నష్టం ఏమీ లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.