అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని జగన్ తో పాటు సీబీఐని గతంలో కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే, జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు ఇంకోసారి గడువు కోరారు. లాక్‌డౌన్ కారణంగా జగన్ కౌంటర్ దాఖలు చేయలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, కౌంటర్‌ను మెయిల్ ద్వారా సమర్పించవచ్చని, ఉద్దేశపూర్వకంగానే ఆయన జాప్యం చేస్తున్నారని రఘురామ న్యాయవాది అన్నారు.
అలాగే, కేంద్ర దర్యాప్తు బృందం కూడా కౌంటర్ ఎందుకు వేయట్లేదో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. కౌంటర్ దాఖలు కోసం గడువును పెంచకూడదని, జరిమానా విధించాలని ఈ సందర్భంగా ఆయన కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలుకు జగన్ తో పాటు సీబీఐకి చివరి అవకాశాన్ని ఇస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఒకవేళ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు జూన్ 1కి వాయిదా వేసింది.