జపాన్‌లో జననాల రేటు రోజురోజుకు తగ్గిపోతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. యువతీ యువకులను పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడం ద్వారా పడిపోతున్న జననాల రేటును తిరిగి గాడిన పెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల యెన్‌లు (భారత కరెన్సీలో రూ. 4 లక్షలకు పైగా) ప్రోత్సాహక బహుమతి కింద ఇవ్వనుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ సొమ్ము ఎంతగానో పనికివస్తుందని ప్రభుత్వం పేర్కొంది.అయితే, పథకాన్ని ప్రకటిస్తూనే కొన్ని నిబంధనలు కూడా విధించింది. యువతీ యువకులు తొలుత తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. వయసు 40 ఏళ్లకు మించకుండా, వార్షికాదాయం 5.4 లక్షల కంటే తక్కువగా ఉన్న వారే ఈ పథకానికి అర్హులని తెలిపింది. కాగా, జపాన్‌లో గతేడాది 8.65 లక్షల మంది మాత్రమే జన్మించారు. మరి పథకాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకుని దేశ జనాభాను ఏమాత్రం పెంచుతారో వేచి చూడాల్సిందే!