జనవరి 29 :: దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో 10 వ స్థానంలో నిలిచిన కరీం నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె. సృజన్ రెడ్డి ని డీ.జీ.పీ. ఎం. మహేందర్ రెడ్డి అభినందించారు. నేడు హైదరాబాద్ లోని డీ.జీ.పీ. కార్యాలయంలో ఎస్.హెచ్.ఓ (సి.ఐ. ) సృజన రెడ్డి ని శాలువాతో సత్కరించి నగదు బహుమతిని మహేందర్ రెడ్డి అందచేశారు. నార్త్ జోన్ ఐ.జీ. నాగి రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమల హాసన్ రెడ్డి లు కూడా హాజరైన ఈ కార్యక్రమం లో డీ.జీ.పీ. మాట్లాడుతూ, ఉత్తమ పౌర సేవలు, ఫ్రెండ్లి పోలీసింగ్, నేర పరిశోధన, మహిళా భద్రత, ఎస్.సి., ఎస్.టీ లకు చెందిన కేసులకు సంబంధించి త్వరితగతిన పరిశోధన పూర్తి చేయడంలో చేసిన కృషి, మిస్సింగ్ కేసులను ఛేదించడం తదితర అంశాలలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపికవడం లో కృషి చేసిన హోమ్ గార్డ్ అధికారి నుండి ఎస్.హెచ్.ఓ స్థాయి అధికారిని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా రెండు సంవత్సరాలు రెండు పోలీస్ స్టేషన్లు టాప్ టెన్ పోలీస్ స్టేషన్లుగా నిలవడం పట్ల కమీషనర్ కమల హాసన్ రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భగా చొప్పదండి, జమ్మికుంట పోలీస్ స్టేషన్ లలో పని చేసే హోమ్ గార్డ్ ఆఫీసర్ నుండి ఉన్నతాధికారులఅందరికి నగదు పురస్కారాన్ని అందచేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు.
సి.ఐ. సృజన రెడ్డి ని ప్రత్యేకంగా అభినందించిన డీ.జీ.పీ.
దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో ఒకటిగా జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను తీర్చిదిద్దడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాష్ట్రపతి పతకం జీవన్ రక్షా మెడల్ ను పొందిన సి.ఐ. సృజన రెడ్డి ని శాలువాతో సత్కరించడంతో పాటు ప్రత్యేకంగా నగదు బహుమతిని డీ.జీ.పీ అందచేశారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మడిపల్లి గ్రామంలో ని చేద బావిలో పడి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను తన ప్రాణాలను లెక్కచేయకుండా సి.ఐ. సృజన్ రెడ్డి కాపాడినందుకు గుర్తింపుగా ఈ రాష్ట్రపతి మెడల్ లభించింది. తన కెరీర్ లో మరిన్ని సేవలను అందచేయాలని డీ.జీ.పీ. ఆకాంక్షించారు.