జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ మరోసారి విరుచుకుపడింది. మోర్టార్లు, ఇతర ఆయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ ఎస్సై, ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. హాజీ పీర్ సెక్టార్ లో సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) ఎస్సై మరణించగా, బారాముల్లాలోని నంబ్లా సెక్టార్ లో ఇద్దరు జవాన్లు నేలకొరిగారు.అంతేకాదు, బారాముల్లా జిల్లాలోని కామల్ కోటే ప్రాంతంలో ఇద్దరు సాధారణ పౌరులు కూడా చనిపోయారు. హాజీ పీర్ సెక్టార్ లో ఓ మహిళ కూడా పాక్ కురిపించిన గుళ్లవర్షానికి బలైంది. భద్రతా బలగాలకు చెందిన ముగ్గురి మృతిని అధికారులు నిర్ధారించారు. అయితే, పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ సాయుధ దళాలు జరిపిన కాల్పుల్లో 8 మంది పాక్ సైనికులు హతమయ్యారని వెల్లడించారు.