ఇటీవలే జమ్మూ కశ్మీర్ లో ఐదుగురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత భద్రతా బలగాలు మరోసారి తమ పాటవాన్ని ప్రదర్శించాయి. జమ్మూ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ముష్కరులను హతమార్చాయి.షోపియాన్ జిల్లాలో ఉగ్ర కదలికలపై సమాచారం అందుకున్న సాయుధ బలగాలు కిలూరా ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ (కట్టడి ముట్టడి) నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఉగ్రవాదులకు దీటుగా బదులిచ్చాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్టు గుర్తించారు. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.