భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దీపావళి పండుగ నేపధ్యంలో బాణసంచా, క్రాకర్స్‌కు సంబంధించిన విషయంలో జిల్లా ప్రజలకు, టపాసుల దుకాణాలు నడిపే వారికి సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరు డాక్టర్ ఎం వి రెడ్డి ఐఎయస్. దీపావళి పండుగను పురస్కరించుకుని బాణ సంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసిన నేపధ్యంలో టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేయగా, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉన్న నేపధ్యంలో టపాసుల వల్ల వచ్చే కాలుష్యంతో కరోనా బాధితులకు శ్వాస సంబంధిత ఇబ్బందులు కలగకుండా, పర్యావరణానికి నష్టం తగ్గించి, 30 % తక్కువ పొగ, తక్కువ శబ్ధం వచ్చే గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించగా జిల్లా ప్రజలకు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రజలు తప్పని సరిగా పాటించాలని , ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించి గ్రీన్ క్రాకర్స్ కాకుండా ఇతర క్రాకర్స్ ఎవరైనా అమ్మకాలు జరిపినా, కాల్చినా కేసులు నమోదు చేయబడునని, కేవలం గ్రీన్ క్రాకర్స్‌తో మాత్రమే పండగ జరుపుకోవాలని ప్రజలకు ఆయన స్ఫష్టం చేశారు.