జమ్మూకశ్మీర్, లడఖ్ ల మ్యాప్‌లను తప్పుగా చూపిన ట్విట్టర్‌పై తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్‌కు యూపీలోని బులందర్‌షహర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్‌లో అంతర్భాగమైన ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా చూపించడంపై భజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి అభ్యంతరాలు తెలుపుతూ ఫిర్యాదు చేయడంతోనే పోలీసులు ఐపీసీ 505(2), ఐటీ సవరణ చట్టం 2008లోని సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు.
ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడిందని, రాజద్రోహం కింద చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ కోరారు. పోలీసులు ఎఫ్ఐఆర్‌లో ట్విట్టర్ ఇండియా న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ అమృతా త్రిపాఠి పేరును కూడా నమోదు చేశారు. కాగా, ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిపై నమోదైన రెండో కేసు ఇది. ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించి కూడా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ట్విట్టర్లో ఓ పోస్ట్ ను కొందరు వైరల్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసుపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ ఘటన మరవక ముందే మరో కేసు ఆయనపై నమోదైంది. కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్‌కు మధ్య కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. భారత్‌లోని చట్టాల ప్రకారమే ట్విట్టర్ నడుచుకోవాలని కేంద్ర సర్కారు స్పష్టం చేస్తోంది. అయితే, ఈ విషయంలో ట్విట్టర్ తీరు మార్చుకోకపోవడంతో ‘మధ్యవర్తి’ హోదాను తొలగిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.