లాక్ డౌన్ కారణంగా మార్చి రెండో వారం నుంచి ఆగిపోయిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు గత నెల నుంచి తెలంగాణలో ప్రారంభం కాగా, పోలీసులు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిన్న రాత్రి తనిఖీలకు దిగిన వేళ, మందు కొట్టి వస్తున్న ఓ వ్యక్తి, తనిఖీలను కాస్తంతా దూరంగానే గమనించి, తన భార్యను, బండిని వదిలేసి వెళ్లిపోయాడు. భర్త పరుగు తీయడంతో, ఏడుస్తూ కూర్చున్న ఆమెను గమనించిన పోలీసులు, తొలుత స్టేషన్ కు తీసుకెళ్లి, ఆపై బంధువులకు అప్పగించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నిన్న రాత్రి శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి వద్ద స్థానిక పోలీసులు మందుబాబులను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో షాద్ గనర్ సమీపంలోని నందిగామకు చెందిన రాజు అనే వ్యక్తి, మందు కొట్టి, తన భార్యతో పాటు బైక్ పై అదే దారిలో వచ్చాడు. పోలీసులు తనిఖీలు చేస్తున్నారని చూసిన అతను, తన బండిని పక్కనే ఆపేసి పారిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియని రాజు భార్య, అక్కడే విలపిస్తూ కూర్చుండిపోయింది. పోలీసులు ఆరా తీయగా, తన భర్త మద్యం తాగాడని, ఆపై ఇక్కడకు తీసుకుని వచ్చి, తనిఖీలను గమనించి వెళ్లిపోయాడని చెప్పింది. ఆమెకు ధైర్యం చెప్పిన పోలీసులు, ఆపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, ఆమెను క్షేమంగా ఇంటికి పంపించారు.