తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వానలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలోని 646 ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, నల్గొండలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడం, తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునగడంతో భారీ నష్టం వాటిల్లింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న బలహీనపడినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి మాత్రం కొనసాగుతున్నట్టు చెప్పారు. వర్షాలు జోరుగా కురుస్తుండడంతో పగటి ఉష్ణోగ్రత 26 నుంచి 32 డిగ్రీలుగా నమోదవుతోంది.