తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని తమ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, ఇతర నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పోటీ చేస్తున్నారు. వాణీ దేవిని గెలిపించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలో బీజేపీ నుంచి సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ నిలిచారు. ఆయనకు వామపక్ష పార్టీలు, తెలంగాణ గిరిజన సంఘం సహా పలు సంఘాలు ఇప్పటికే మద్దతును బహిరంగంగా ప్రకటించాయి. ఇక కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, టీడీపీ నుంచి ఎల్.రమణ పోటీ చేస్తున్నారు. వీరే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్.. గతంతో పోల్చితే అనేక స్థానాలను కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకగాక, పీఆర్సీ నివేదికపై రాష్ట్ర ఉద్యోగుల్లో అసంతృప్తి, ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కాకపోవడంతో యువతలో అసంతృప్తి ఉంది. ఈ అవకాశాన్ని వాడుకోవాలని ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు భావిస్తున్నారు.