తెలంగాణలో కొవిడ్-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 60 వేలు దాటింది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకు 18,263 నమూనాలను పరీక్షించగా, వారిలో 1,811 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 521 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,717 అని పేర్కొంది. ఆసుపత్రుల్లో 15,640 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 44,572 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 505కి చేరింది.