గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయంటూ దేవుడి పేరుతో వస్తువులు విక్రయించే ప్రకటనలు ఇటీవల టీవీలలో ఎక్కువయ్యాయి. తాయెత్తులు మొదలు కొని గొలుసులు, ఉంగరాల వరకు విక్రయిస్తూ మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని ధరించడం ద్వారా శుభాలు జరుగుతాయని, అడ్డంకులు తొలగిపోతాయని, విశేషంగా డబ్బు వచ్చి పడిపోతుందని నమ్మబలుకుతున్నారు. ఆ ప్రకటనలు చూసిన వారు నిజమేనని నమ్మి మోసపోతున్నారు. హనుమాన్ చాలీసా యంత్రం వంటి ప్రకటనలు టీవీలో రాకుండా నిషేధించాలని కోరుతూ రాజేంద్ర అనే ఉపాధ్యాయుడు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. విచారించిన జస్టిస్ టీవీ నలవాడే, జస్టిస్ ఎంజీ సేవ్లీకర్ నేతృత్వంలోని ఔరంగాబాద్ బెంచ్ ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దేవుడి పేరుతో వస్తువులను విక్రయించడం, వాటికి మానవాతీత శక్తులు ఉన్నాయని చెప్పడం చట్టవిరుద్దమని కోర్టు తేల్చి చెప్పింది. సమస్యలను అవి పరిష్కరిస్తాయని చెప్పడం నేరమని పేర్కొంది. ఇలాంటి ప్రకటనను ఇవ్వడం, చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్న బెంచ్.. నరబలి, చేతబడి వంటి అమానుష చర్యల నివారణ, నిర్మూలన చట్టం కిందకే ఇది కూడా వస్తుందని పేర్కొంది.