ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం తన కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. సలాం కుటుంబం చనిపోతూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే ఇంకే ఆలోచన లేకుండా న్యాయబద్ధంగా ఏంచేయాలో దాని ప్రకారమే చేశామని వెల్లడించారు.పోలీసుల మీద ఏ ప్రభుత్వం కేసులు పెట్టదని, అరెస్టులు చేయదని, కానీ తమ ప్రభుత్వం తప్పు చేసింది పోలీసులైనా వదిలిపెట్టదని స్పష్టం చేశారు. తన, మన అనే భేదం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీసులైనా ఒకటే, నేనైనా ఒకటే, న్యాయం ఎవరికైనా ఒక్కటిగానే ఉండాలని అంటూ తమ వైఖరిని చాటిచెప్పారు.గతంలో టీడీపీకి సంబంధించిన కాపు వెల్ఫేర్ కార్పొరేషన్ లో నామినీ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి, టీడీపీలో క్రియాశీలక పదవుల్లో ఉన్న వ్యక్తి ఇవాళ నంద్యాల నిందితుల కోసం బెయిల్ పిటిషన్ వేశారని సీఎం జగన్ ఆరోపించారు. “కోర్టుల్లో వీళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడంలేదు. కోర్టులో బెయిల్ లభించడం కూడా మన కళ్ల ముందే జరిగింది. అయినా కూడా పోరాటం ఎక్కడా ఆగలేదు. బెయిల్ రద్దు కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాం. మంచి చేయాలని కోరుకునే ప్రభుత్వం మాది. కానీ తప్పు లేకపోయినా బురద చల్లాలని చేసే ప్రయత్నాలు చూస్తే బాధ కలుగుతుంది. ఆ బాధలోనే ఇలా మాట్లాడాల్సి వస్తోంది” అని సీఎం జగన్ వివరించారు.