ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వినతులపై ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది.తాము తొలగించిన వ్యక్తిని మళ్లీ ఎస్ఈసీగా నియమించారనే భావనతో నాన్ కోఆపరేటివ్ గా వ్యవహరిస్తోందని హైకోర్టు విమర్శించింది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని , కానీ, రాజ్యాంగ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని చెప్పింది. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోలేకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలుతుందని తెలిపింది.మూడు రోజుల్లో పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వినతిపత్రాన్ని అందించాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా తమకు నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సరిగా నిధులను ఇవ్వడం లేదంటూ అక్టోబర్ 21న హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ కు నిధులను నిలిపివేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే) ప్రకారం చట్ట విరుద్ధమని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.