మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. బిడ్డా.. అని ఈటల అంటున్నారని, తానూ ఓ బీసీ బిడ్డనేనని అన్నారు. ‘‘ఏం బెదిరిస్తున్నవా ఈటల రాజేందర్? నువ్వు బెదిరిస్తే ఇక్కడ బెదిరేటోడు ఎవ్వడు లేడు.. బిడ్డా..బిడ్డా అని బెదిరిస్తే అంతకన్నా ఎక్కువ మాట్లాడుతా. నేనూ బీసీ బిడ్డనే. నీ కన్నా నాకు ఆత్మగౌరవం ఎక్కువ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టే ఈటలకు ఇన్నాళ్లూ ఆ గౌరవమైనా దక్కిందన్నారు.నిజంగా ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములు కొన్నట్టు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే సీఎం కేసీఆర్.. ఈటలను బర్తరఫ్ చేశారని చెప్పారు.అసైన్డ్ భూములు, దేవరయాంజాల్ ఆలయ భూముల వ్యవహారంలో ఈటల తప్పు చేశారని అధికారులు తేల్చారని గంగుల చెప్పారు. అసైన్డ్ భూములను కొన్నట్టు రెవెన్యూ రికార్డుల ఆధారంగా ప్రభుత్వాధికారులు తేటతెల్లం చేశారన్నారు. నిజంగా ఆత్మగౌరవం ఉండి ఉంటే ఆ భూములన్నింటినీ ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలని సవాల్ విసిరారు.1992 నుంచి చట్టబద్ధంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని గంగుల చెప్పారు. ఈటలలాగా అసైన్డ్ భూములు కొని గోడౌన్లు కట్టి మద్యం షాపులకు ఇవ్వలేదన్నారు. హుజూరాబాద్ లో ఇప్పటికీ క్వారీలు నడుస్తున్నాయని, దానిపై సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ ఎందుకు ఫిర్యాదు చేయలేదని మండిపడ్డారు.గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో ఈటల కుమ్మక్కయ్యారా? అని గంగుల ప్రశ్నించారు. తాను పన్నులు ఎగ్గొట్టినట్టు నిరూపిస్తే దానికి ఐదింతలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. అధికారుల కమిటీ వేసి విచారణ చేయించేందుకు తాను సిద్ధమని, విచారణలో తప్పు చేశానని తేలితే దేనికైనా సిద్ధమని అన్నారు.తాను ఓడిపోతానని ఈటల రాజేందర్ ప్రచారం చేశాడని, కానీ, తాను గెలిచేటప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శించారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈటల తనతో మాట్లాడనే లేదని అన్నారు. వ్యక్తిగతంగా పోతే తానూ వ్యక్తిగతంగా పోవాల్సి వస్తుందని, దానిని తట్టుకోలేవని, అది చాలా భయంకరంగా ఉంటుందని ఈటలను హెచ్చరించారు.